Revanth Reddy నాకు ఇంగ్లీష్ రాదు… కానీ కామన్ సెన్స్ ఉంది..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై తన దృష్టి కోణాన్ని స్పష్టంగా తెలియజేశారు. చారిత్రక ఉదాహరణలు ప్రస్తావిస్తూ, గోల్కొండ కోట, కోహినూర్ వజ్రం, హైటెక్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులు ఎవరి పాలనలో అమలయ్యాయో గుర్తుచేశారు. సంపాదించినది ఎవరు తీసుకుపోవచ్చో కానీ సమాజానికి ఇచ్చినది ఎప్పటికీ ఇక్కడే నిలిచిపోతుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో తెలంగాణను పునరుత్పాదక శక్తితో కూడిన అల్ట్రా మోడర్న్ సిటీగా అభివృద్ధి చేసి, రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైలు, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే, పోర్టులకు డెడికేటెడ్ రైల్వే కారిడార్, మెట్రో విస్తరణ వంటి ప్రాజెక్టులను అమలు చేయాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.
హైటెక్ సిటీ నిర్మాణం చంద్రబాబు నాయుడు పాలనలో, అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం రాజశేఖర్ రెడ్డి పాలనలో జరిగిందని ఆయన గుర్తు చేశారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి నాయకులు దేశానికి అందించిన స్ఫూర్తి ఎప్పటికీ మనలో కొనసాగుతుందని చెప్పారు. భాష జ్ఞానం కంటే కామన్ సెన్స్ ముఖ్యమని, భాష ఒక అదనపు అర్హత మాత్రమేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమెరికా, జపాన్, జర్మనీ, చైనా వంటి దేశాలు భాషకన్నా ప్రతిభ, పట్టుదలతో అభివృద్ధి సాధించాయని ఉదహరించారు. పి.వి. నరసింహారావు 14 భాషలు మాట్లాడగలరని, ఇతరుల భాషలో మాట్లాడితే ప్రజల్లో అనుబంధం పెరుగుతుందని అన్నారు.
తనకు తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి, పట్టుదల, సహనం, రోజుకు 18 గంటలు పనిచేసే ఓపిక, వయసు, ప్రజలతో అనుబంధం ఉన్నాయని తెలిపారు. రియల్ ఎస్టేట్‌ను ఒక సెంటిమెంట్‌గా పేర్కొంటూ, దాన్ని సానుకూల దృక్పథంతో ముందుకు నడిపితే పెట్టుబడుల విలువ పెరుగుతుందని చెప్పారు. కోకపేటలో భూముల ధరలు ఏళ్ల వ్యవధిలో లక్షల నుంచి కోట్లకు పెరిగిన ఉదాహరణను ఇచ్చారు. తెలంగాణను సెంటిమెంట్ హబ్, డెవలప్మెంట్ హబ్‌గా మార్చి, పెట్టుబడిదారుల పెట్టుబడులకు భద్రత, లాభాలు అందించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
క్రెడై మిత్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అభినందిస్తూ, తెలంగాణ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Also Read : Amaravati ORR Map: రూట్ వివరాలు, జిల్లాల వారీగా కవర్ అయ్యే గ్రామాలు