అనుకోకుండా గాయపడినా, శస్త్రచికిత్స జరిగినా శరీరం త్వరగా కోలుకోవాలంటే కేవలం చికిత్సలకే కాకుండా ఆహారంపైనా సమానంగా దృష్టి పెట్టాలి. సరైన పోషకాలు గాయాలను, కుట్లను త్వరగా మానించడంలో కీలకపాత్ర పోషిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాంటి పోషకాలతో నిండి ఉన్న ఆహారాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. గుడ్డు:

శరీర బరువుకు తగినంత ప్రొటీన్స్ అవసరం. ఉదాహరణకు, 68 కిలోల బరువు ఉన్న వ్యక్తికి రోజుకు 105-135 గ్రాముల ప్రొటీన్ అవసరమవుతుంది. గుడ్డు మంచి ప్రొటీన్ మూలం. ఇందులో ఉండే విటమిన్ A, B12, జింక్, ఐరన్, సెలీనియం లాంటి పోషకాలు శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి, గాయాన్ని త్వరగా మానేలా సహాయపడతాయి.
2. గింజలు మరియు విత్తనాలు:

బాదం, వాల్‌నట్, పిస్తా, సన్ఫ్లవర్ విత్తనాల్లో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ E, జింక్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పదార్థాలు శరీరాన్ని రక్షిస్తూ గాయాల నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి.
3. క్రూసిఫెరస్ కూరగాయలు:

క్యాలీఫ్లవర్, బ్రోకలీ, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, కాలే వంటి కూరగాయలు విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో నిండినవే. వీటిలోని గ్లూకోసినోలేట్లు శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇవి గాయాన్ని త్వరగా మానించడంలో సహాయపడతాయి.
4. చిలగడదుంప:

ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఇందులోని విటమిన్ C, కెరోటినాయిడ్లు, మాంగనీస్, అలాగే హెక్సోకినేస్, సిట్రేట్ సింథేస్ అనే ఎంజైమ్‌లు గాయాల నుంచి త్వరగా కోలుకునేందుకు సహాయపడతాయి.
5. ఆకుకూరలు:

పాలకూర, తోటకూర, మెంతికూర వంటి ముదురు ఆకుపచ్చ కూరల్లో విటమిన్ C, ఫోలేట్, మాంగనీస్, ప్రొవిటమిన్ A, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించి, రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు గాయాల వేగంగా మానటంలో సహాయపడతాయి.
గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణుల అభిప్రాయాలు, పరిశోధనల ఆధారంగా మీ అవగాహన కోసమే అందించబడింది. ఆరోగ్య సమస్యల విషయంలో తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవాలి.
Also Read : Ajwain in Telugu: వాముతో ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
[…] […]