తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. అనూహ్యంగా బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ తన సిట్టింగ్ సీటును కోల్పోయింది. మరోవైపు, బీఆర్ఎస్ ఈ ఎన్నికల పోటీకి దూరంగా ఉండటం గమనార్హం. ఈ ఫలితాలతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం పెరిగింది. గెలిచిన ఎమ్మెల్సీలను స్వయంగా ప్రధానమంత్రి అభినందించారు. ఇక, ఢిల్లీలోనుంచి ‘ఆపరేషన్ తెలంగాణ’ ప్రారంభమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

అసాధారణ ఫలితాలు – రాజకీయాల్లో కొత్త లెక్కలు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా మారాయి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈసారి పోటీకి దూరంగా ఉండగా, బీజేపీ ఊహించని రీతిలో రెండు స్థానాల్లో విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటును కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా, కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి రెండో ప్రాధాన్య ఓట్ల ఆధారంగా విజయం సాధించారు.

కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ

బీజేపీ కేవలం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవడమే కాకుండా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తన బలాన్ని మరోసారి రుజువు చేసుకుంది. గతంలో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సొంతమయింది. అయితే, ఈసారి ఆయన పోటీకి ఆసక్తి చూపకపోవడంతో కాంగ్రెస్ అధిష్ఠానం నరేందర్ రెడ్డిని బరిలో దింపింది. రాష్ట్రంలో 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, మిత్రపక్షంగా సీపీఐ మద్దతు ఉన్నా కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది.

బీజేపీ వ్యూహం – కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు హెచ్చరిక

కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం నిర్వహించినా పెద్దగా ప్రభావం చూపలేదు. మరోవైపు, బీజేపీ ఈ నియోజకవర్గ పరిధిలో ఏడు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలతో ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది. ప్రచారం ఆలస్యంగా ప్రారంభమైనా, అనూహ్య పోటీ ఇచ్చి, పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా బలాన్ని పెంచుకుంది.

ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేయాలని భావిస్తే, ఇప్పుడు బీజేపీ వేగంగా పుంజుకోవడం కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్‌కూ ఒక హెచ్చరికగా మారింది. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో మరింత ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Also Read : నాగబాబుకు మంత్రి పదవి – ఏపీ రాజకీయాల్లో మలుపు

2 thoughts on “తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు”

Leave a Comment