మీ కళ్లముందే మీ బిడ్డ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతుంటే… ఆ బిడ్డను బతికించే మందు ధర ఏడాదికి అక్షరాలా రూ. 9 కోట్లు అని తెలిస్తే ఆ తల్లిదండ్రుల గుండె ఎలా తల్లడిల్లిపోతుంది? సామాన్యులే కాదు, కోటీశ్వరులు కూడా ఊహించలేని ఈ అసాధ్యమైన పరిస్థితిని హైదరాబాద్‌కు చెందిన ఒకే ఒక్క డాక్టర్ తలకిందులు చేశారు!
అసలు ఏం జరిగింది? ఆ ₹9 కోట్ల మందు కేవలం ₹2.5 లక్షలకు ఎలా దిగివచ్చింది?
అరుదైన జన్యుపరమైన వ్యాధి ‘అలన్-హెర్న్డన్-డడ్లీ సిండ్రోమ్’ (AHDS) బారిన పడిన చిన్నారుల మెదడు ఎదుగుదలకు ‘టిరాట్రికోల్’ (Tiratricol) అనే మందు అత్యవసరం. కానీ, అంతర్జాతీయ మార్కెట్లో దీని ఏడాది ఖర్చు రూ. 4.68 కోట్ల నుండి రూ. 9 కోట్ల వరకు ఉంది. హైదరాబాద్‌కు చెందిన చిన్నారి ఆరవ్ తల్లి నెలకు రూ. 12-13 లక్షలు వెచ్చించి జర్మనీ నుండి ఈ మందును తెప్పించలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.
ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది!
సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ హైదరాబాద్ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ రంగంలోకి దిగారు. ఫార్మా కంపెనీల చుట్టూ తిరిగినా నిరాశే ఎదురైంది. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. ‘యాక్సెస్ టు మెడిసిన్స్ ఇండియా’, నెదర్లాండ్స్‌కు చెందిన ‘ఫార్మాస్యూటికల్ అకౌంటబిలిటీ ఫౌండేషన్’ (PAF) సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో పోరాటం చేశారు.
ఫలితం? నెదర్లాండ్స్‌లోని ‘ట్రాన్స్‌వాల్ ఫార్మసీ’లో ఇదే మందును ప్రత్యేకంగా తయారు (Compounding) చేయించడం ద్వారా, ఏడాది మందు ఖర్చును ఏకంగా రూ. 2.5 లక్షలకు తగ్గించగలిగారు!
అంతేకాదు, విరాళాల సేకరణ ద్వారా ఈ మందును భారత్‌కు తెప్పించారు. ఈ నవంబర్ 30న, ఆరవ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు ఏడాదికి సరిపడా మందును పూర్తిగా ఉచితంగా అందించబోతున్నారు. ఒక డాక్టర్ పట్టుదల ఏడు కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది!
Also Read : IBPS PO Mains Result 2026 OUT: Phase 2 Results | IBPS PO Mains Result 2026 link











