vangalapudi anitha భోజనంలో బొద్దింక కలకలం.. ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి

Payakaraopeta Girls Hostel Inspection by AP Home Minister vangalapudi anitha : ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఇటీవల తన స్వగ్రామ నియోజకవర్గం పాయకరావుపేటలో ఆకస్మికంగా పర్యటించారు. తన పర్యటనలో భాగంగా అక్కడి బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించి విద్యార్థినుల పరిస్థితులు పరిశీలించారు. హాస్టల్‌లో విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను వ్యక్తిగతంగా తెలుసుకున్నారు.
అయితే భోజన సమయంలో అనితకు చేదు అనుభవం ఎదురైంది. బాలికలతో కలిసి భోజనం చేస్తుండగా, ఆమె తినే ఆహారంలో బొద్దింక కనిపించటం కలకలం రేపింది. దీనితో హోంమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి భోజనాన్ని విద్యార్థులకు ఎలా అందిస్తున్నారు అని వంటశాల సిబ్బంది పై మండిపడ్డారు.
ఇప్పటికే ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతుల కొరతపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఓ హాస్టల్‌లో బాత్‌రూమ్ తలుపులు లేక విద్యార్థినులు చున్నీలతో మానం కాపాడుకోవాల్సిన దుస్థితి బయటపడింది. ఇప్పుడు సాక్షాత్తూ హోంమంత్రికే ఇలాంటివే అనుభవంలోకి రావటంతో ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్ అయింది.
అనిత తన సందర్శనలో హాస్టల్ వసతులపై పూర్తి స్థాయిలో ఆరా తీశారు. హాస్టల్ వార్డెన్ గైర్హాజరు, భోజన మెనూ అమలులో లోపాలు, నీటి సరఫరాలో సమస్యలు వంటి అనేక అంశాలను స్వయంగా గమనించారు. వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మౌలిక వసతుల మెరుగుదల కోసం హాస్టల్‌లో సీసీ కెమెరాలు వెంటనే ఏర్పాటు చేయాలని, భోజనం నాణ్యతపై నిత్య పర్యవేక్షణ ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదికను రెండు రోజుల్లో అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, చదువుపై సర్కార్ దృష్టి పెట్టాలన్నది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సంఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. హోంమంత్రికే ఇలా జరిగితే.. బాలికల పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన నెటిజన్లలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతటిదో మరోసారి చాటి చెప్పిన సంఘటన ఇది.