BRS సంచలన నిర్ణయం: కవితను పార్టీ నుంచి సస్పెండ్…
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో పెద్ద దుమారం రేగింది. పార్టీ ఎమ్మెల్సీ కే.కవితను బీఆర్‌ఎస్ అధిష్టానం తక్షణం సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తీసుకున్నట్లు ప్రధాన కార్యదర్శి టి.రవీందర్‌రావు అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
ఇటీవలి కాలంలో కవిత పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారని, ఆమె ప్రవర్తన పార్టీకి నష్టం కలిగించేలా మారిందని బీఆర్‌ఎస్ నాయకత్వం భావించింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో మంత్రి హరీశ్‌రావుతో పాటు సంతోష్‌రావుపైనా కవిత బహిరంగ ఆరోపణలు చేయడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామం పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే అవకాశముందని ఆందోళన వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. వెంటనే సస్పెన్షన్ వేటు వేసి, ఇకపై ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని స్పష్టంచేసింది. బీఆర్‌ఎస్ లోపల ఈ పరిణామం పెద్ద సంచలనంగా మారింది.
కవితపై ఇంతటి పెద్ద నిర్ణయం రావడం వల్ల పార్టీ భవిష్యత్ రాజకీయ సమీకరణలపై కూడా ప్రభావం పడనుంది. ఇప్పటికే అసంతృప్త స్వరాలు వినిపిస్తున్న బీఆర్‌ఎస్ లో ఈ సంఘటన మరింత చర్చనీయాంశమవుతోంది. ఇక కవిత తన సస్పెన్షన్‌పై ఎలా స్పందిస్తారు, భవిష్యత్తులో ఏ దిశగా అడుగులు వేస్తారు అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
