హైదరాబాద్-యాదగిరిగుట్ట MMTS ట్రైన్ ప్రారంభం భక్తులకు ఊరట.. రూ.20కే గంటలో యాదాద్రి చేరిక!

హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట (యాదాద్రి) వరకు ప్రయాణించే భక్తులకు ఇప్పుడు శుభవార్త. చాలా కాలంగా ఎదురవుతున్న ట్రాఫిక్, అధిక ఛార్జీలు, ప్రయాణానికి పడుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-యాదగిరిగుట్ట మధ్య MMTS రైలు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కేవలం రూ.20 టికెట్‌తో భక్తులు ఒక గంటలోపే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు చేరుకునే అవకాశం లభిస్తుంది.
ఈ ప్రయాణ మార్గం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.412 కోట్ల బడ్జెట్ కేటాయించింది. మొదటి విడతలో రూ.100 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. ఘట్‌కేసర్ నుంచి భువనగిరి వరకు సుమారు 33 కిలోమీటర్ల మేర మూడో లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వంగపల్లి వరకు నాలుగో లైన్ కోసం 79 ఎకరాల ప్రైవేట్ భూముల భూసేకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం భక్తులు ప్రధానంగా రోడ్డు మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే ట్రాఫిక్ జామ్‌లు, అధిక బస్ ఛార్జీలు, ప్రైవేట్ వాహనాల దారుణ వసూలు భక్తుల ప్రయాణాన్ని కష్టతరం చేస్తున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని ఎంఎంటీఎస్ ట్రైన్ ద్వారా భక్తులకు సరసమైన ధరలకు, వేగవంతమైన ప్రయాణాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించగా, వెంటనే స్పందించిన రైల్వే శాఖ మంత్రి రవ్‌నీత్ సింగ్ ప్రాజెక్టు మొదలుపెట్టేందుకు లేఖరాశారు. ఈ ప్రాజెక్టు తొలిసారి 2016-17లో ప్రతిపాదించబడినప్పటికీ, నిధుల కేటాయింపు ఆలస్యం వల్ల పునఃప్రారంభం ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మొత్త వ్యయం రూ.464 కోట్లుగా నిర్ణయించబడింది.
ఈ MMTS రైలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాక, యాదాద్రికి వెళ్లే భక్తులకు మాత్రమే కాక, జనగామ జిల్లాలోని స్థానికులకు కూడా ప్రయోజనం కలుగనుంది. వారు సులభంగా హైదరాబాద్‌కు రాకపోకలు సాగించవచ్చు. ఎంపీ చామల ప్రకారం, ఈ సేవలను జనగామ వరకూ పొడిగించేందుకు కేంద్రంతో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
మొత్తానికి, హైదరాబాద్-యాదగిరిగుట్ట MMTS ట్రైన్ ద్వారా భక్తులకు సౌకర్యవంతమైన, సరసమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వేసిన ఈ అడుగు ప్రగతిపథంలో పెద్ద దశగా నిలవనుంది. రైలు పట్టాలెక్కిన అనంతరం, యాదాద్రికి భక్తుల రాక మరింతగా పెరిగే అవకాశముంది.
Also Read : ప్రముఖ సినీ నటికి ఏడాది జైలు శిక్షతో షాక్