బంగారం కొనుగోలు చేసే ముందు జీఎస్టీ రేట్లు తెలుసుకోవడం ముఖ్యం. ప్రస్తుతం బంగారం, వెండిపై 3% జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలపై 5% జీఎస్టీ వర్తిస్తోంది. రూ.1 లక్ష విలువైన ఆభరణాలపై ఎంత అదనంగా చెల్లించాలో తెలుసుకోండి.
సామాన్యులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆభరణం బంగారం. ప్రతి పండుగ, పెళ్లి, శుభకార్యాల సమయంలో బంగారు ఆభరణాలు కొనడం ఒక సంప్రదాయంగా మారిపోయింది. అయితే బంగారం కొనుగోలు చేసే సమయంలో జీఎస్టీ ఎంత వర్తిస్తుందో తెలుసుకోవడం అవసరం. ఇటీవల జీఎస్టీ మండలి పలు వస్తువులపై పన్ను శ్లాబుల్లో మార్పులు చేసినప్పటికీ బంగారం, వెండిపై మాత్రం ఎలాంటి తగ్గింపు ప్రకటించలేదు. ప్రస్తుతం బంగారం కొనుగోలు చేస్తే 3 శాతం జీఎస్టీ వర్తిస్తోంది.
ఉదాహరణకు, ఒకరు రూ.1 లక్ష విలువైన బంగారు ఆభరణాలు కొంటే, అందులో 3 శాతం అంటే రూ.3,000 జీఎస్టీగా చెల్లించాలి. ఈ 3 శాతాన్ని సెంట్రల్ జీఎస్టీ (1.5 శాతం) మరియు స్టేట్ జీఎస్టీ (1.5 శాతం)గా విభజిస్తారు. బంగారం జీఎస్టీ కేవలం ఆభరణాల విలువపైనే కాదు, తయారీ ఖర్చుపై కూడా వర్తిస్తుంది. మేకింగ్ ఛార్జీలపై 5 శాతం జీఎస్టీ అమలవుతుంది. ఉదాహరణకు ఒక షాపులో రూ.10,000 మేకింగ్ ఛార్జీలు ఉంటే వాటిపై రూ.500 జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దీంతో అసలు ధర, జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అన్నీ కలిపి చివరి మొత్తాన్ని చెల్లించాలి.
దీనితో పాటు హాల్ మార్కింగ్ ఫీజులు కూడా జోడవుతాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే సమయంలో కేవలం బంగారం ధరను మాత్రమే కాకుండా జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, హాల్ మార్కింగ్ ఫీజులు అన్నీ కలిపి మొత్తం ఖర్చును అంచనా వేసుకోవాలి. ప్రస్తుతం బంగారం, వెండి రెండింటిపైనా ఒకే విధమైన 3 శాతం జీఎస్టీ అమలవుతోంది. ఇది ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్, కాయిన్లు, బార్లు అన్నింటికి వర్తిస్తుంది.
ప్రభుత్వం తాజాగా నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించినా, విలువైన లోహాలైన బంగారం, వెండిపై పాత రేట్లే కొనసాగుతున్నాయి. కాబట్టి పండుగ సీజన్‌లో ఆభరణాలు కొనుగోలు చేసే వారు ముందుగానే ఈ ఖర్చులను గమనించి, బంగారం ధరతో పాటు జీఎస్టీ ప్రభావాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి.
Also Read : Income Tax Calculator 2025: మీ ఆదాయంపై ఎంత పన్ను వస్తుందో వెంటనే లెక్కించుకోండి












