ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన – అన్నదాతల సంక్షేమానికి భారీ ప్రకటనలు
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తాజా ప్రకటనలు రాష్ట్రవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రైతులకు బహుముఖ సంక్షేమాన్ని అందించే అన్నదాత సుఖీభవ పథకానికి అమలు తుది ముహూర్తం ఖరారైంది. ఎన్నికల హామీగా ప్రతి రైతు ఖాతాలో రూ.20 వేలు జమ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వెంటనే తాజా ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో నిధులను కేటాయించింది.
ఈ పథకం అమలు ఎలా ఉంటుందన్నదానిపై ముఖ్యమంత్రి మరింత స్పష్టతనిచ్చారు. వచ్చే నెల నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో మొత్తంగా రూ.20 వేలు జమ చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో రూ.5 వేలు, రెండో విడతలో మరో రూ.5 వేలు, చివరగా మూడో విడతలో రూ.4 వేలు జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు.
ఇక “తల్లికి వందనం” కార్యక్రమంపై కూడా చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ప్రభుత్వం నేరుగా నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే రూ.4 వేల పెన్షన్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా రూ.10 వేల నుంచి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు.
అంతేకాక, వెనకబడిన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వెల్లడించారు. ఉద్యోగాల్లో 33%, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించడమే కాక, జిల్లాల వారీగా బీసీ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మహిళా పారిశ్రామిక వేత్తలను లక్ష్యంగా పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు.
అన్నదాత సుఖీభవ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.9,400 కోట్లు కేటాయించింది. కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని విస్తరించే దిశగా అధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు నేరుగా మద్దతు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.