వీరికి అన్నదాత సుఖీభవ డబ్బులు పడవు కారణం ఇదే

అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో ఈ పథకం అమలు తాత్కాలికంగా నిలిచిపోయింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమాచారం ప్రకారం ఈనెల 10, 12 తేదీల్లో రెండు ZPTC, మూడు MPTC, రెండు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నందున ఆ ప్రాంతాలు ఎన్నికల కోడ్ పరిధిలోకి వచ్చాయి. ఎన్నికల నియమావళి ప్రకారం కోడ్ అమల్లో ఉండగా కొత్తగా నిధులు విడుదల చేయడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు.
దీని ప్రభావంగా ప్రభుత్వం ఈరోజు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన రూ.5 వేల అన్నదాత సుఖీభవ నిధులు ఆ ప్రాంతాల రైతులకు చేరలేదు. అయితే, కేంద్రం అందించే పీఎం కిసాన్ కింద రూ.2 వేల సహాయం మాత్రం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని స్పష్టం చేశారు.
ఎన్నికల కోడ్ ముగిసిన తరువాతే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద మిగిలిన నిధులను విడుదల చేస్తుందని సమాచారం. దీంతో సంబంధిత మండలాలు, గ్రామాల్లో ఉన్న రైతులు కొన్ని రోజులు వేచి చూడాల్సి వస్తోంది. ఈ పథకం రైతులకు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, వ్యవసాయ పనుల్లో కొంత ఉపశమనం కలిగించే విధంగా ఉండటంతో అందరి దృష్టి కోడ్ ఎప్పుడు ముగుస్తుందన్న దానిపైనే ఉంది.