ఆంధ్రప్రదేశ్‌కు భారీ టెక్ బూస్ట్… ‘క్వాంటమ్ వ్యాలీ’ గేమ్‌ప్లాన్ ఇదే!

క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ముందంజ వేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ‘క్వాంటమ్ వ్యాలీ’ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ ను అనుసరించి, రాష్ట్రాన్ని క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనలో గ్లోబల్ హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “క్వాంటమ్ టెక్నాలజీ భవిష్యత్తును మలిచే విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుంది. 1990లలో ఐటీ విప్లవాన్ని నడిపినట్లుగానే, క్వాంటమ్ టెక్నాలజీ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు తొలి స్థానాన్ని సంపాదించాలనుకుంటున్నాం” అని అన్నారు.
ఈ ప్రాజెక్ట్ ఐఐటీ మద్రాస్, టీసీఎస్, ఐబీఎం సంస్థల భాగస్వామ్యంతో రూపుదిద్దుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షించడంతో పాటు, భారీ స్థాయిలో పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్టు సీఎం తెలిపారు.
ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు సోమవారం జరిగిన కీలక సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, ఎల్ అండ్ టీ చైర్మన్ & ఎండీ ఎస్. ఎన్. సుబ్రహ్మణ్యన్, శాస్త్ర & సాంకేతిక శాఖ కార్యదర్శి అభయ్ కరండీకర్, క్వాంటమ్ టెక్నాలజీ సెంటర్ హెడ్ జేబీవీ రెడ్డి, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ సత్యనారాయణ కళిదిండి, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి, ఐబీఎం రీసెర్చ్ ఇండియా డైరెక్టర్ అమిత్ సింగ్, ఐబీఎం క్వాంటమ్ ఇండియా లీడర్ వెంకట్ సుబ్రహ్మణియన్ పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంకేతిక రంగాల్లో భారీ మార్పులను తెస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.