26 Apr 2025, Sat

Mega DSC 2025 Notification: మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. మరో 10 రోజుల్లోనే నోటిఫికేషన్‌

cm-chandrababu

ఎప్పటినుండో ఎదురుచూస్తున్న రాష్ట్ర నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను మరో పది రోజుల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే భర్తీ ప్రక్రియను వేగంగా ప్రారంభిస్తామని వెల్లడించారు.

అమరావతి, మార్చి 25:
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే భర్తీ ప్రక్రియ ప్రారంభించి, పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి చేసి పోస్టింగ్‌లు అందించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్లతో మంగళవారం జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయి తమకు విశేష మద్దతు అందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించినట్లు స్పష్టం చేస్తూ, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయడం ఖాయమని చంద్రబాబు తెలిపారు. జూన్‌లో పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేయాలని స్పష్టంగా ఆదేశించారు. అదేవిధంగా, మే నెలలో ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభించి, రూ.15 వేల చొప్పున పిల్లల సంఖ్యను అనుగుణంగా కుటుంబాలకు అందజేస్తామని తెలిపారు.

స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను సాధించేందుకు 10 సూత్రాల మేరకు పనిచేయాలని, రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. జీఎస్‌డీపీ, జీవీఏలతో పాటు తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచే దిశగా కృషి చేయాలని, వచ్చే ఏడాదికి 15% ప్లస్ జీఎస్‌డీపీ సాధించేందుకు కలెక్టర్లు ప్రత్యేకంగా శ్రమించాలన్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు వ్యవసాయం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.

ఇప్పటికే కూటమి ప్రభుత్వం డీఎస్సీ సిలబస్ విడుదల చేయగా, ఏప్రిల్‌లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. డీఎస్సీ ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

భర్తీ చేయనున్న మొత్తం 16,371 ఉపాధ్యాయ పోస్టుల విభజన:

  • 6,371 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు
  • 7,725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
  • 1,781 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు
  • 286 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు
  • 52 ప్రిన్సిపాల్ పోస్టులు
  • 132 పీఈటీ టీచర్ పోస్టులు

మెగా డీఎస్సీ ద్వారా వేలాది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు అందనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *