Bigg Boss 19 Salman Khan Remuneration లీక్.. ఈ సీజన్ కోసం ఎంత తీసుకున్నారంటే?

Bigg Boss 19 Salman Khan Remuneration : దేశంలో బుల్లితెర రియాల్టీ షోలు అనగానే ముందుగా గుర్తొచ్చే షో ‘బిగ్ బాస్’. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులను సొంతం చేసుకున్న ఈ కార్యక్రమం ప్రతిసారీ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. హిందీ వెర్షన్ ‘బిగ్ బాస్ 19’ త్వరలోనే ఆగస్టు 30న జియో సినిమా ఓటీటీలో ప్రసారం కానుంది. ఈసారి షోను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయనున్నాడన్న వార్తతోనే అంచనాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే షో ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో, సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్‌పై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, సల్మాన్ ఖాన్ ఈసారి రూ. 120 నుంచి 150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. సుమారు 15 వారాల పాటు అతను షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నందున, ఒక్కో వారానికి రూ. 8 నుండి 10 కోట్ల వరకు తీసుకుంటున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో బిగ్ బాస్ సీజన్ 17 కోసం రూ. 200 కోట్లు, సీజన్ 18 కోసం దాదాపు రూ. 250 కోట్లు తీసుకున్నారన్న సమాచారం ఉంది. ఓటీటీ వెర్షన్ అయిన బిగ్ బాస్ OTT2 కోసం సల్మాన్ ఖాన్ రూ. 96 కోట్లు తీసుకున్నాడన్నది అప్పట్లో పెద్ద చర్చే అయ్యింది.
ఇక ఈసారి కొత్త ఫార్మాట్‌తో బిగ్ బాస్ 19 ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. మొత్తం షో సుమారు ఐదు నెలల పాటు కొనసాగనుండగా, మొదటి మూడు నెలల వరకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా కనిపిస్తారు. మిగతా రెండు నెలలు ఫరా ఖాన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్ వంటి గెస్ట్ హోస్టులు ఈ బాధ్యతను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా షోలో కొత్తదనం తీసుకురావడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.
అలాగే ఈ సీజన్ కంటెస్టెంట్ల విషయంలోనూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు గౌతమి కపూర్, ధీరజ్ ధూపర్, అలీషా పన్వర్, ఖుషీ దూబే, శ్రీరామ్ చంద్ర, మిస్టర్ ఫైసు, అర్షిఫా ఖాన్ వంటి 20 మందికి పైగా ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరెవరు ఇంటికి ఎంట్రీ ఇవ్వబోతున్నారో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా చెప్పాలంటే, భారీ బడ్జెట్, స్టార్ హోస్ట్, కొత్త ఫార్మాట్, ఆసక్తికరమైన కంటెస్టెంట్లతో బిగ్ బాస్ 19 ఈ సారి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Also Read : Roja Selvamani Biography రోజా సెల్వమణి బయోగ్రఫీ