జనసేన పార్టీకి పిఠాపురంలో భారీ షాక్ తగిలింది, నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్న మాకినీడు శేషు కుమారి ఈరోజు వైసీపీలోకి చేరిపోయారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల దగ్గర పడుతున్న సందర్భంగా పిఠాపురంలో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి జనసేన పార్టీ తరఫునుండి పోటీ చేసిన అభ్యర్థి పార్టీ మారిపోయారు. పవన్ కళ్యాణ్ కు షాకిస్తూ పిఠాపురం జనసేన మాజీ ఇంచార్జ్ మాకినీడు శేషు కుమారి, సీఎం జగన్ సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నారు. పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుస్తానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనకు షాక్ ఇస్తూ మరుసటిరోజే కీలక నేత మాకినీడు శేషు కుమారి వైసిపి గూటికి చేరటం గమనార్హం.

2019 ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా మాకినీడు శేషుకుమారి పోటీ చేశారు. అప్పటి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన పెండెం దొరబాబు విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు రెండో స్థానం దక్కింది. ఇక జనసేన అభ్యర్థి మాకినీడు శేషకుమారి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
అయితే ఈసారి 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారు. వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. కాపు సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉన్న కారణం చేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీకి మొగ్గుచూపగా.. వైసీపీ సైతం అంతే తెలివితో కాపు సామాజికవర్గ మహిళా నేత అయిన వంగా గీతను తమ అభ్యర్థిగా బరిలో నిలిపింది.
ఈ నేపథ్యంలో ఈసారి 2024 ఎన్నికల్లో పిఠాపురంలో పోరు రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్తితుల్లో గత 2019 ఎన్నికల్లో సుమారు 29 వేల వరకూ ఓట్లు సాధించిన మాకినీడు శేషుకుమారి పార్టీని వీడటం జనసేన పార్టీకి కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితి అని చెప్తున్నారు. మరోవైపు జనసేన పార్టీకి నిబద్ధత లేదని మాకినీడు శేషకుమారి విమర్శించారు.
జనసేన పార్టీకి విధివిధానాలు లేవన్న మాకినీడు శేషకుమారి… జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పోలికేంటని విమర్శించారు. మరి మాకినీడు శేషకుమారి జనసేనను వీడి వైసీపీలో చేరటం ఫ్యాన్ పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడుతుందనేదీ ఎన్నికల ఫలితాల తర్వాత వెల్లడికానుంది.
[…] తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ వేడుకను […]