సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన పర్యటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పర్యటన ఒక రకమైన “శవ రాజకీయాలకు” నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు.
డ్రామాలా కనిపించిన జగన్ పర్యటన
జగన్ పర్యటనను ముందే ప్లాన్ చేసి, కావాలని ఒక సీన్ క్రియేట్ చేశారని అనిత ఆరోపించారు. ప్రజల్లో ఉద్రేకం రేకెత్తించేలా వైసీపీ వర్గాలు వాట్సాప్ లో రెచ్చగొట్టే సందేశాలు పంపించాయని, ఈ పరిణామాల వల్ల పోలీసులు భారీగా మోహరించాల్సి వచ్చిందని తెలిపారు. భద్రత కోసం 1100 మంది పోలీసులను మోహరించామని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ఇలాంటిదే క్రిమినల్ నాయకుడి ప్రవర్తన
జగన్ ప్రవర్తన ఒక క్రిమినల్ నాయకుడి ప్రవర్తనలా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. హెలిపాడ్ వద్ద వైసీపీ కార్యకర్తలు తోసుకుంటూ వచ్చారని, పలువురు పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. ఆ తర్వాత మళ్లీ పోలీసులు తప్పు చేశారని వైసీపీ ఆరోపించడం దుర్మార్గమని మండిపడ్డారు.
జగన్ పాలన గుర్తుకొచ్చింది
జగన్ మాట్లాడిన ప్రతి మాట వినగానే ఆయన పాలనలోని అరాచకాలు గుర్తొచ్చాయని అనిత చెప్పారు. 12:42కి రోడ్డు మార్గం ఖరారైనప్పటికీ, ఒక్కసారిగా హెలికాప్టర్ వెళ్లిపోవడం వెనుక కూడా ప్రీ-ప్లాన్ ఉన్నట్లు అనిపించిందన్నారు. ఇది జగన్ కుట్రగా చూస్తున్నామని తెలిపారు.
చంద్రబాబుపై జరిగిన ఘటన మరచిపోతారా?
విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్షనేత చంద్రబాబుపై జరిగిన దాడిని ప్రజలు మర్చిపోలేదని, అప్పుడు వైసీపీ ఎలా ప్రవర్తించిందో గుర్తు చేశారు. ముసుగులేసుకొని ప్రజలను బెదిరించిన పాలనను ప్రజలు మర్చిపోవడం లేదన్నారు. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, హోంమంత్రి వంటి వారిపై అనేక కేసులున్నాయని, అవన్నీ ప్రశ్నించినందుకే పెట్టారని స్పష్టం చేశారు.
జగన్ మారకపోతే 11 సీట్లు కూడా రావు
వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాదాపు 2800 హత్యలు జరిగాయని ఆరోపించారు. జగన్ మారకపోతే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావు అని హెచ్చరించారు. ఖాకీ డ్రెస్సు కొనగొన్నది సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి కాదు, అది పోలీసు విధులకు అర్హత కలిగిన వారు ధరించాల్సింది అని పేర్కొన్నారు.
చాపర్ ఘటనపై సమగ్ర దర్యాప్తు
జగన్ ను వదిలి హెలికాప్టర్ వెళ్ళిపోయిన అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని హోంమంత్రి స్పష్టం చేశారు. పెందుర్తి ట్రాఫిక్ విషయంలో కూడా పోలీసుల వైఫల్యం లేదని, వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారు ఎవరైనా అయినా సరే, తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.












