నలభై ఏళ్లకు పైగా రాజకీయ ప్రస్థానం, ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం, పార్టీ నిర్మాణంలో మేలిమి ఇసుకరేణువైన నేత… అలాంటి యనమల రామకృష్ణుడు తాజాగా టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యారు.
75 ఏళ్ల వయసులోనూ రాజకీయంగా చురుకుగా ఉన్న యనమల, గత కొన్నేళ్లుగా టీడీపీలో తగ్గిన ప్రాధాన్యతను గమనిస్తూ వస్తున్నారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంత్రిగా వ్యవహరించినా, తర్వాత పార్టీ లోపలి రాజకీయాలు ఆయన స్థితిని మారుస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే పార్టీ సమావేశాల్లో తక్కువగా కనిపిస్తున్న ఆయన, తాజాగా శాసనమండలి సభ్యుల వీడ్కోలు కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి ముఖ్య నేతలు హాజరైన వేడుకకు ఆయన రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అసంతృప్తి ఫలితమేనా గైర్హాజరు?
యనమల రాకపోవడం వెనుక పార్టీ అధిష్టానంపై ఆయనకు నెలకొన్న అసంతృప్తి కారణమన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఆయనకు గత కొంతకాలంగా దక్కుతున్న ప్రాధాన్యత తగ్గిన నేపథ్యంలో, పార్టీలో తన స్థానం మసకబారుతుందనే భావనతోనే ఆయన దూరంగా ఉంటున్నారని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ లో అంతర్గత అసంతృప్తుల కల్లోలం?
కొన్నేళ్లుగా పార్టీ కోసం శ్రమించిన సీనియర్ నేతలకు సరైన గుర్తింపు లేకపోవడం, వారిని అప్రమత్తంగా పక్కనపెడుతున్నట్లు కనిపించడం వంటి అంశాలు ఇటీవల తెలుగుదేశం పార్టీ (Telugudesham Party )లో పెరుగుతున్నాయి. ముఖ్యంగా యనమల లాంటి నేతలు పార్టీ భవిష్యత్‌పై ఎలా స్పందిస్తారనేదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ పరిణామాలపై యనమల త్వరలోనే స్పష్టత ఇస్తారా? లేక తెలుగుదేశం పార్టీ నుంచి మరింత దూరం వెళ్తారా? అనేది వేచి చూడాల్సిన విషయం.
Also Read : బీసీలకు గుడ్ న్యూస్: సీఎం కీలక ప్రకటన








